పదేళ్లు పూర్తిచేసుకున్న తొలి తెలుగు న్యూస్ చానల్ ఈటీవీ 2


తెలుగులో శాటిలైట్ చానల్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినవెంటనే చానల్ ప్రారంభించకుండా దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవటంలో తలమునకలైన ఈటీవీ తెలుగులో తొలి శాటిలైట్ చానల్ కాలేకపోయింది. కారు చౌకగా సినిమాల ప్రసార హక్కులు సొంతం చేసుకోవటం ఆ ఆలస్యంలో భాగమే కాబట్టి ఆ తరువాత కాలంలో ఆ ప్రయోజనాలు పొందగలిగింది. సన్ టీవీ చేతుల్లోకి వెళ్ళిన తరువాతనే జెమినీ టీవీ నెంబర్ వన్ స్థానం సంపాదించుకోగలిగింది తప్ప అలస్యంగా మొదలైనా, అప్పటివరకూ ఈటీవీ ఆధిక్యమే కొనసాగింది. అదే క్రమంలో న్యూస్ ప్రారంభించటంలోనూ తెలుగులో తొలి శాటిలైట్ చానల్ అయింది.
ఆంధ్రావని తో మొదలై..
తెలుగులో ప్రైవేట్ శాటిలైట్ చానల్స్  మొదలైన రోజుల్లో భారతదేశం నుంచి అప్ లింకింగ్ సౌకర్యం లేకపోవటంతో వార్తలు ప్రసారం చేయటం సాధ్యమయ్యేదికాదు. వినోదకార్యక్రమాలైతే, ముందుగానే విమానంలో టేప్ లు పంపి ప్రసారం చేసేవారు. రోజువారీ వార్తలకు అలా సాధ్యం కాదు గాబట్టి మొదట్లో వినోదకార్యక్రమాలే ప్రసారమవుతూ వచ్చాయి. అయితే,  అప్పటికే జీ టీవీ హాంకాంగ్ లో, సన్ టీవీ సింగపూర్ లో చిన్నపాటి స్టుడియో సెట్ తయారుచేసుకొని అక్కడికే న్యూస్ రీడర్స్ ను పంపి ఆ ఒక్క కార్యక్రమం అక్కడ తయారై అప్ లింక్ అయ్యే ఏర్పాటు చేశాయి. అదే సమయానికి ఫిలిప్పైన్స్ నుంచి ఈటీవీ అప్ లింకింగ్ కేంద్రం కొలంబోకు మారింది. 
జీ, సన్ టీవీలను పాక్షికంగా ఆదర్శంగా తీసుకున్న ఈటీవీ మధ్యే మార్గంగా చెన్నైలో స్టుడియో ఏర్పాటుచేసి, అక్కడ వార్తల బులిటెన్ తయారుచేసి విమానంలో కొలంబో పంపేది. ఆ విధంగా ఆంధ్రావని పేరుతో అక్కడినుంచి శాటిలైట్ కు అప్ లింక్ అయ్యేవి. ఆ రోజుల్లో దూరదర్శన్ వార్తలతో విసుగెత్తిన ప్రేక్షకులకు మరుసటి ఉదయం అందినా ఈ వార్తలు బాగానే రుచించాయి. మధ్యలో 1999 ఎన్నికల ఫలితాలు ప్రసారం చేయవలసి వచ్చినపుడు ఘంటసాల రత్నకుమార్, మృణాళిని కొలంబో వెళ్ళి అక్కడే చిన్నపాటి స్టుడియో సెట్ నుంచి పనిచేశారు.
ఢిల్లీ సగం, చెన్నై సగం.. పరుగే పరుగు
వార్తల విషయంలో ఈటీవీ ఖర్చుకు వెనకాడలేదు. వి-శాట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందే తడవుగా దాన్ని వాడుకుంది. నేరుగ చెన్నై వి ఎస్ ఎన్ ఎల్ కేంద్రం నుంచి వార్తలు అప్ లింక్ చేసుకునే వెసులుబాటు రాగానే పూర్తి స్థాయి వార్తల బులిటెన్లకు రంగం సిద్ధం చేసుకుంది. ఢిల్లీలో ఒక స్టుడియో ఏర్పాటు చేసుకొని జాతీయవార్తల ప్రసారానికి సిద్ధమైంది. ఢిల్లీ లో కనీసం 10 నిమిషాలకు తగ్గకుండా వార్తలు తయారయ్యేవి. మిగిలినవి హైదరాబాద్ నుంచి వచ్చే విజువల్స్ , వార్తలతో చెన్నైలో రూపుదిద్దుకునేవి. అయితే, ప్రాధాన్యాన్ని బట్టి ఆరోజు ఢిల్లీ వార్తలు ముందు ఇవ్వాలా, చెన్నై వార్తలు ముందు ఇవ్వాలా అనేది నిర్ణయించుకునేవారు. రెండు చోట్లా న్యూస్ రీడర్స్ ఉండేవారు. అలా రెండు ప్యాకేజీలు తయారై ప్రసారమయ్యేవి. పనిభారం తగ్గటం లాంటి సౌలభ్యమున్నా, పూర్తిగా ప్రాధాన్య క్రమం పాటించటం సాధ్యమయ్యేది కాదు. అలా మొదలైన ఈటీవీ వార్తలు వరుసగా బులిటెన్స్ పెంచుకుంటూ వచ్చాయి. రాత్రి 9 గంటల బులిటెన్ అప్పటినుంచి బాగా ప్రాచుర్యం పొందింది.
అయితే, అప్పటికీ సమస్యలు పూర్తిగా తీరలేదు. చెన్నైలోని ఈటీవీ సిబ్బంది అనివార్యంగా తమ స్టుడియో నుంచి వి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయానికి న్యూస్ కాసెట్లతో పరుగులు తీయాల్సి వచ్చేది. తొలితరం సిబ్బందికి ఇదొక విచిత్రమైన అనుభవం. ప్రసార సమయానికి పది నిమిషాల ముందు ఒక క్యాసెట్ పరుగుతీస్తే మరో ఐదారు నిమిషాలకు మరో బైక్ సిద్ధంగా ఉండేది.  అప్పటికింకా నాన్ లీనియర్ ఎడిటింగ్ లేదు కాబట్టి వరుసగా ఒక్కో కాసెట్ వెళ్ళేది. బ్రేకింగ్ న్యూస్ వస్తే అదనంగా మరో కాసెట్ పరుగు తీయాల్సి వచ్చేది. మౌంట్ రోడ్డులో నాలుగైదు నిమిషాల్లో నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోలేకపోతే ఖాళీతెర కనిపించే ప్రమాదముండటంతో ప్రతిరోజూ ప్రాణాలకు తెగించేంత సాహసం చేయాల్సివచ్చేది. బైక్ మీద వెనుక కూర్చున్న వ్యక్తి చేతిలో క్యాసెట్ చూసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసీ చూడనట్టు వదిలేసేవారు.

హైదరాబాద్ లో సొంత టెలీపోర్ట్ .. ఘంటారావం

ఈటీవీ హైదరాబాద్ ఫిల్మ్ సిటీ లో సొంత ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేసుకోగానే చెన్నై నుంచి తరలి వచ్చింది. మరిన్ని చానల్స్ ప్రారంభించటంలో ఈటీవీ సంస్థ చొరవచూపుతూ వచ్చింది. మరోవైపు వార్తల ఆధారంగా రూపొందించే కార్యక్రమాలు మరింతగా పెంచటమూ మొదలైంది. అప్పటికే ప్రతిధ్వని, నేటిభారతం లాంటి కార్యక్రమాలు విశేషంగా ప్రజాదరణ పొందుతూ వచ్చాయి. వార్తల వాటా మరింతగా పెంచాలనుకున్న యాజమాన్యం గంట గంటకూ ఐదేసి నిమిషాల బులిటెన్స్ ప్రసారం చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఘంటారావం పేరుతో అలా గంటగంటకూ సంక్షిప్తంగా వార్తలందించటం మొదలైంది.
కానీ ఇక్కడ జరిగిన ఒక తప్పిదం ఈ టీవీ సీరియల్స్ ను దెబ్బతీసింది. గంట ప్రారంభంలో వార్తలు మొదలుకావటం వలన సరిగ్గా ఆ సమయంలో జెమినీలో సీరియల్ మొదలవగానే ఎక్కువమంది ప్రేక్షకులు అటు వెళ్ళిపోయేవారు. ఈ టీవీలో వార్తలు పూర్తయి, సీరియల్ మొదలయ్యేసరికి చాలా తక్కువమంది ప్రేక్షకులు మిగిలేవారు. ఆ తరువాత అర్థగంటకూ అదే పరిస్థితి. నిజానికి గంట పూర్తికాకముందు వార్తలు ప్రసారం చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.  అంటే, 8.00, 9.00, 10.00 గంటలకు  కాకుండా 7.55, 8.55, 9.55… కు ప్రసారం చేసి ఉంటే  సీరియల్స్ మీద ఆ ప్రభావం పడి ఉండేది కాదు. వ్యూహంలో జరిగిన తప్పిదమిది. మొత్తానికి ఏదేమైనా, వార్తలకు తగినంత మంది ప్రేక్షకులున్నారని, వారికోసం ప్రత్యేకంగా ఒక న్యూస్ చానల్ అవసరమని ఈటీవీ యాజమాన్యం గుర్తించింది.
తొలి తెలుగు న్యూస్ చానల్ ఈటీవీ 2
2003 ఆగస్టు 28న న్యూస్ చానల్ లైసెన్స్ పొందిన ఈటీవీ 2 అదే ఏడాది డిసెంబర్ 29ఈటీవీ 2 పేరుతో పూర్తి స్థాయి 24 గంటల న్యూస్ చానల్ ప్రారంభించింది. ( కానీ పక్షం రోజులు ఆలస్యంగా టెస్ట్ సిగ్నల్ మొదలుపెట్టి 2004 ఫిబ్రవరి 12న పూర్తి స్థాయి ప్రసారాలు మొదలుపెట్టిన టీవీ9 తొలి తెలుగు న్యూస్ చానల్ గా చెప్పుకోవటం గమనార్హం. లైసెన్స్ పరంగా చూసినా, టీవీ9  కి అక్టోబర్ 23న లైసెన్స్ వచ్చింది ). రేయింబవళ్ళూ వార్తలూ, వార్తల ఆధార కార్యక్రమాలూ ఇలా ఇస్తూ పోతే చూస్తారా? అనే అనుమానాలమధ్యనే కొంత ఆసక్తితో ప్రేక్షకులు ఈ చానల్ ను చూడటం మొదలుపెట్టారు.
సమయం పెరగటం తప్ప ఈటీవీ వార్తలకూ, ఈటీవీ2 వార్తలకూ మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. కాకపోతే, బులిటెన్లు, వార్తల ఆధార కార్యక్రమాలు బాగా పెరిగాయి. ఈటీవీ నుంచి కొన్ని కార్యక్రమాలు ఈటీవీ2 కు మారాయి. అన్నదాత లాంటి కార్యక్రమాలు ఈటీవీలో కొనసాగుతుండగానే ఈటీవీ2 లో జైకిసాన్ పేరుతో అదే తరహా కార్యక్రమం మొదలైంది. మిగిలిన చానల్స్ పట్టించుకోకపోయినా, అంతర్జాతీయవార్తలకు ఈటీవీ ప్రాధాన్యం ఇస్తూనే వచ్చింది. మార్గదర్శి లాంటి కార్యక్రమాలమీద భారీగా వెచ్చిస్తూనే వచ్చింది.
వేగం, కచ్చితత్వం మధ్య పోటీలో ...
మొదటి ఆరునెలల కాలంలో మాత్రమే రేటింగ్స్ పరంగా ఈటీవీ2 మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. వేగానికీ, కచ్చితత్వానికీ మధ్య జరిగిన పోటీలో వేగానికే ప్రేక్షకులు పట్టం కట్టారు. వేగం ధాటికి ఒక్కోసారి కచ్చితత్వం దెబ్బతిన్నాసరే మెజారిటీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ప్రేక్షకులకు ఏది కావాలో ఆలోచించటం తప్ప ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఈటీవీ 2 ఏనాడూ ఆలోచించిన  దాఖలాలు కనిపించవు. మంచి కార్యక్రమాలే అయినా, వాటిని ప్రేక్షకులకు నచ్చేవిధంగా తయారుచేసి అందించటంలో వెనకబడింది. ప్రేక్షకులకు తగినట్టు వ్యూహం మార్చుకోవటానికి ఇష్టపడలేదు. ప్రత్యక్షప్రసారాలలోనూ చొరవచూపలేకపోయింది.
న్యూస్ ప్రొడక్షన్ ఏర్పాట్లు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉండటం వలన చర్చా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోవటం ఒకలోపమని కొంతమంది విశ్లేషిస్తుండగా, సంస్థాపరంగా రూపొందించుకున్న కొన్ని నిర్దిష్ట విధానాలను కొనసాగించటమే తప్ప ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారాలనుకోకపోవటం వలన చానల్ లో మార్పు కానరాలేదనేవాళ్ళు మరికొందరు. అయితే, చానల్ అలాగే ఉండాలని కోరుకునే వాళ్ళూ కొంతమంది ఉండటం వలన అలాంటి వీర విధేయులైన అభిమానులు ఈటీవీ2 కి సొంతమయ్యారు.  
అయితే, చానల్ కు మచ్చ తెచ్చిన కార్యక్రమంగా నేరాలు-ఘోరాలు మిగిలిపోతుంది.  జరిగిన నేరాన్ని పునర్నిర్మించి కళ్ళకుకట్టినట్టు చూపటం ద్వారా నేరాలు ఎలా చేయాలో చెబుతున్నదంటూ విమర్శలొచ్చినా చాలాకాలం ఖాతరు చేయలేదు. చివరికి కర్నాటకలోనూ ఇదే ప్రయోగం చేసి, అక్కడి కోర్టు మొట్టికాయలేశాక ఆపేసినా, తెలుగులో మాత్రం ఆ తరువాత కూడా కొనసాగించింది. ప్రత్యక్ష ప్రసారాలలోనూ విలేఖరులను వీలైనంతవరకు కనబడకుండా జాగ్రత్త పడుతుందనే విమర్శలూ ఉన్నాయి.
మొదటి నుంచి ఐదో స్థానానికి
కొత్త చానల్స్ వస్తున్న కొద్దీ పోటీ మరింత పెరుగుతూ వచ్చింది. ఈ పోటీలో ఈటీవీ 2 పూర్తిగా తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. అయినా సరే, రేటింగ్స్ తో సంబంధం లేకుండా, ప్రయోజనకరమని భావించిన  కొన్ని కార్యక్రమాల ప్రసారం కొనసాగిస్తూనే ఉంది. నగర ప్రాంతాల్లో ప్రేక్షకులను ఆకర్షించినంతగా గ్రామీణ ప్రాంత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నదన్నది కూడా రేటింగ్స్ లెక్కలు చెబుతున్న నిజం. అయితే, ఈటీవీ గ్రూప్ లో మెజారిటీ వాటా వదులుకున్నప్పుడు కూడా ఈటీవీ 2 ను ఉంచేసుకోవటం యాజమాన్యానికి ఈ చానల్ మ్ మీద ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం.
ఈ పదేళ్ళ ప్రస్థానంలో తన ప్రత్యేకతలు చాటుకుంటూనే ఉంది. అనవసరంగా బ్రేకింగ్ పేరుతో హడావిడి చేయకపోవటం, వార్తలు తప్ప అభిప్రాయాలకు పెద్ద పీట వేయకూడదన్న అభిప్రాయానికి కట్టుబడి ఉండటం ఈటీవీ 2 ప్రత్యేకతలు. సంచలనాత్మక కార్యక్రమాల జోలికి పోదన్న పేరును చానల్ సొంతం చేసుకోగలిగింది. అందుకే ఎప్పుడూ స్టింగ్ ఆపరేషన్స్ జోలికి పోకుండా కొన్ని ప్రమాణాలు పాటిస్తూ వచ్చింది. ఈ పదేళ్లలో పెద్దగా మారని ఈటీవీ 2 మరో పదేళ్లకూ మారకపోవచ్చు. తన అభిప్రాయాలను ప్రజలు వినితీరాలనే అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిరుచులను కూడా పరిగణనలోకి తీసుకొని మార్పులకు స్వాగతం పలికితే తప్ప అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకోవటం సాధ్యం కాకపోవచ్చు.

   

0 comments:

Trendy LIST